Kanaka Durgamma | విజయవాడ కనకదుర్గమ్మ ఆవిర్భావం! ఇంద్రకీలాద్రి పురాణ రహస్యాలు

kanka durgamma vijayawada
Spread the love

Kanaka Durgamma | విజయవాడ కనకదుర్గమ్మ చరిత్ర మరియు ఇంద్రకీలాద్రి పురాణ రహస్యాలు

భారతదేశంలోని అత్యంత శక్తివంతమైన శక్తి పీఠాలలో విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ ఆలయం ఒకటి. కృష్ణా నదీ తీరాన వెలసిన ఈ క్షేత్రానికి వేల ఏళ్ల చరిత్ర ఉంది. అర్జునుడు పాశుపతాస్త్రం కోసం తపస్సు చేసిన పుణ్యభూమిగా, దుష్ట రాక్షసులను సంహరించిన కనకదుర్గమ్మ నివాసంగా ఈ ప్రాంతం విరాజిల్లుతోంది. అసలు ఇంద్రకీలాద్రి అనే పేరు ఎలా వచ్చింది? అమ్మవారు ఇక్కడ కనకదుర్గగా ఎందుకు పిలవబడుతున్నారు? అనే ఆసక్తికరమైన పురాణ గాథలను ఈ వ్యాసంలో మనం వివరంగా తెలుసుకుందాం.

కనకదుర్గమ్మ (kanaka durgamma) అవతారం – శంభు, నిశంభుల కథ:

దుర్గమ్మ (kanaka durgamma)  ఆవిర్భావం చాలా ఆశ్చర్యమైనటువంటి స్వరూపం. ఆవిడ వెలసిన క్షేత్రానికి విజయవాడ(ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణాజిల్లా) అనే పేరు పురాణాలలో విజయవాటిక అనే పేరు. ఎందుకంటే శంభు నిశంభులనే ఇద్దరు రాక్షసులు చతుర్ముఖ బ్రహ్మ కోసం తపస్సు చేశారు, హంసవాహనం మీద బ్రహ్మ ప్రత్యక్షమై ఏమి కావాలి అని అడిగారు. రాక్షసుడు మరణం లేకుండా వరం ఇవ్వమన్నారు, బ్రహ్మగారు పుట్టినవాడు చనిపోక తప్పదు, చనిపోయిన వాడు పుట్టక తప్పదు. అందుకని ఇంకొకటి అడుగు అన్నారు మేము దేవతలను జయించాలి, ప్రపంచంలో ఉండేటటువంటి ఏ జాతివలనైనా సరే పక్షి గాని, జంతువుల కానీ, పురుష జాతి వల్ల మాత్రం మాకు అపకారం జరగకూడదు.

📢 Join Our WhatsApp Channel here:

button

ఏ జాతిలో ఉన్న పురుషులు మా ప్రాణం తీయరాదు అని అడిగారు అలా ఎందుకు అడిగారంటే వాళ్లకి అహంకారం, పురుషుడే చేయలేని పని ఆడది ఎలా చేస్తుంది అని ఆడదానిపట్ల చులకన భావన, స్త్రీతో మాకు ఏమి భయం లేదు కానీ పురుషుల వల్ల మాకు అపకారం జరగకూడదు అని వరం అడిగారు, సరేనని బ్రహ్మ వెళ్ళిపోయారు, దానితో రాక్షసులు దేవలోకం మీదకి వెళ్లారు, దేవేంద్రుడిని పదవిలో నుంచి తొలగించి అమరావతిని ఆక్రమించి సమస్త భోగాలను అనుభవిస్తున్నారు, అంతేకాకుండా మహర్షుల జోలికి కూడా వెళ్తారు, మునుల జోలికి వెళ్తారు, భగవంతుణ్ణి నమ్ముకున్న వారి జోలికి వెళ్తారు వారిని నానా ఇబ్బందులు పెడతారు.

దుర్గ & కాళిక – దేవీ శక్తుల ఆవిర్భావం:

అప్పుడు అమ్మవారు ఒక ప్రతిజ్ఞ చేసింది ఎప్పుడెప్పుడు నన్నే నమ్ముకున్నటువంటి సాధుపురుషుల యందు రాక్షసులు అనుచితమైనటువంటి రీతిలో ప్రవర్తిస్తారో వాళ్ళ మనసులు కష్టపెడతారో, ఆనాడు నేను ఒక రూపాన్ని ధరించి రాక్షస సంహారం చేస్తాను అని ప్రతిజ్ఞ చేసింది. అందుచేత ఇప్పుడు వారిని సంహరించాలి, కాబట్టి అమ్మవారు తన శరీరంలో నుంచి రెండు అంశలను ప్రాతుర్భావం చేసింది, ఒకటి “కాళిక” స్వరూపం ఇంకొకటి “దుర్గా” స్వరూపం. దానికే “కౌశికి” అని పేరు.

కాళిక ఆకృతి చూడడానికి కించెత్తు భయానకంగా ఉంటుంది. కాళికా మాతను ఉపాసన చేయడంలో ఏ విధమైనటువంటి దోషము లేదు. కాళికామాతను ఉపాసన చేస్తే ఆ తల్లి ఏదైనా ఇవ్వగలరు, అంత శక్తివంతురాలు ఆవిడ, అంతటి నల్లటి శరీరంతో కదిలి నడిచి వెళ్తుంటే ఒంట్లో నుంచి మసిపడుతుందేమో అన్నంత నల్లటి రూపంతో కాళిక వచ్చింది.

శంభు–నిశంభులు & రక్తబీజుని సంహారం:

కాళిక మరియు కౌశికి వాళ్ళిద్దరూ విజయవాటిక ప్రాంతమునకు బయలుదేరారు. అక్కడికి వెళ్ళేటప్పటికి శంభు, నిశంభులుల మంత్రులు చూశారు. మా ప్రభువులు యవ్వనంలో ఉన్నారు. వాళ్ళకి ఇంకా వివాహం కాలేదు, ఇలాంటి పిల్లని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని అనుకొని, ఆ మాట వెళ్లి రాజులకి చెప్పారు. వాళ్లు అమ్మవారికి వివాహం చేసుకుంటామని రాయబారం పంపారు, తల్లి తిరస్కరించింది, అక్కడ పెద్ద యుద్ధం జరిగింది.

అందులో రక్తబీజుని వంటి రాక్షసులు ఉన్నారు, వాడిని ఒక కత్తి పెట్టి పొడిస్తే వాడి రక్తపు చుక్కలు కింద ఎన్ని పడతాయో అందులో నుంచి అన్ని వేల మంది రాక్షసులు  పుడుతూ ఉన్నారు. కౌశికి చూసింది ఏంచేయాలి అని, కాళికా దేవిని పిలిచి చెప్పింది, రక్తం నేల మీద పడితే అందులో నుంచి రాక్షసులు పుడుతున్నారు. అందుకని నీ నాలుక పెద్దగా చాపమంది, ఆవిడ పెద్ద నాలుక చాపింది, దానిమీద యుద్ధం జరిగింది, వాళ్ళని తెగతార్చింది, వాళ్ళు సంహరించబడ్డారు.

అప్పుడు ఆ రక్తం పడిపోతున్న దానిని అంతటిని కాళిక చప్పరించేసింది. చిట్టచివరికి శంభు, నిశంభులు అనేటటువంటి రాక్షసులు ఇద్దరు కూడా ఆ కౌశికి అనేటటువంటి స్వరూపం చేతిలో సంహరించబడ్డారు.

Vijayawada Kanaka Durga Temple Indrakeeladri
Vijayawada Kanaka Durga Temple Indrakeeladri

శక్తి రూపం కనకదుర్గమ్మ (kanaka durgamma) – ఎందుకు ఈ పేరు?

కౌశికి దుర్గాదేవి యొక్క స్వరూపం, దుర్గ యొక్క అంశ.  అక్కడ ఉన్నటువంటి ఋషులందరూ జయజయ ద్వానం చేసినప్పుడు కనక వర్షం కురిపించింది కనుక ఆవిడ “కనకదుర్గ” అని పేరు పెట్టుకుంది, అదే విజయవాటిక.

అక్కడే ఒకానొకప్పుడు మహాభారతం జరిగినటువంటి కాలంలో, పాండవులు అరణ్యవాసం చేస్తున్నటువంటి రోజుల్లో, వ్యాసమహర్షి దర్శనమిచ్చి రాబోయే కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులని ఎదుర్కోవటానికి పాండవులకు మంచి అస్త్రాలు ఉండాలని, అందులో సమర్ధుడు అయినటువంటి అర్జునుని ఎంచుకొని, నువ్వు పరమశివుడి గురించి తపస్సు చేస్తే, ఆయన మెచ్చుకొని నీకు “పాశుపతాస్త్రాన్ని” అనుగ్రహిస్తాడు, పాశుపతాస్త్రం చేతిలో ఉంటే నీకు రక్షణ, నీ శక్తి రెట్టింపు అవుతుంది అందుకని నువ్వు వెళ్లి తపస్సు చెయ్యు అని మహర్షి చెప్పారు, ఎక్కడ తపస్సు చేయాలి అని ఆలోచిస్తూ వస్తున్నటువంటి అర్జునునికి, ఆ ప్రదేశాన్ని దేవేంద్రుడు తరపున ఒక వ్యక్తి వచ్చి సూచించాడు, అదే “ఇంద్రకీలాద్రి”.

స్కాంద పురాణంలో  ఇంద్రకీలాద్రి యొక్క తేజస్సు దుర్గామాతగా ఉన్నది అని కూడా అంటారు”. అందుకని ఆ ఇంద్రకీలాద్రి పర్వత శిఖరం మీద ఆయన కూర్చుని తపస్సు చేస్తే పరమశివుడు ఆయన యొక్క భాణములు వేయగల శక్తిని ఒక్కసారి పరీక్ష చేయాలనుకున్నాడు, ఎందుకంటే ఎవరికి పడితే వాళ్లకి ఇవ్వడానికి వీల్లేదు అటువంటి అస్త్రాలు, అస్త్ర ప్రయోగం చేసేటటువంటి వాడికి ఓరిమి ఉండాలి, ధైర్యం ఉండాలి, యుద్ధం చేయగలగాలి. ఎలా పడితే అలా పిచ్చక మీద బ్రహ్మాస్త్రం లాగా దేని మీద కోపం వస్తేనో బ్రహ్మాస్త్రాలు, పాశుపత అస్త్రాలు, నారాయణ అస్త్రాలు వదలకూడదు. ఇవన్నీ ఉన్నాయా లేవా చూడాలని అనుకున్నాడు ఒక ఆశ్చర్యకరమైన యుద్ధం జరిగింది.

అప్పుడే మోకాసురుడు అడవి పంది రూపంలో వచ్చాడు, పరమశివుడు ఒక ఎరుకల వాని రూపంలో వచ్చాడు, ఇటు అర్జునుడు తపస్సులో ఉన్నాడు, ఆ వచ్చినటువంటి అడవి పంది పెద్ద చప్పుడు చేసింది. లేచి ఒక బాణాన్ని ప్రయోగించాడు, ఆ బాణం తగిలింది, అటు నుంచి పరమశివుడు వేసిన బాణం కూడా తగిలింది, మోకాసురుడు మరణించాడు, పందిని నేను కొట్టాను అన్నాడు పరమశివుడు, కాదు పందిని నేను కొట్టాను అన్నాడు అర్జునుడు, ఇద్దరి మధ్య పోరుసాగింది.

ఒకరేమో మహానుభావుడు దేవతలు అందరి చేత నమస్కరింపబడేటటువంటి పాదములు ఉన్నవాడు. ఇంకొకరు ఆయనని అర్ధించి పాశుపతాస్త్రాన్ని పొందడానికి వచ్చినవాడు.

ఆయనకు స్తోత్రమంతా చేసి మహేంద్రాదులన్, శాశ్వత ఐశ్వర్య సంప్రాప్తులైరి, ఈశ్వర, విశ్వకర్త, సురభ్యార్చిత నాకు అభ్యర్థితంబుల్ ప్రసాదింపు కారుణ్యమూర్తి లోకైకనాథ, మహాదేవ, నమస్తే నమస్తే నమస్తే నమః అని పాదాల మీద పడ్డాడు, పడితే అప్పుడు శంకరుడు కటాక్షించాడు.

కటాక్షించి పాశుపతాస్త్రాన్ని అర్జునుడికి బహుకరించాడు. అర్జునుడికి పాశుపతాస్త్రాన్ని బహుకరించినటువంటి క్షేత్రం కనుక దానికి విజయవాడ అని పేరు, పూర్వం బెజవాడ అని కూడా అనేవారు ఇప్పుడు విజయవాడ అంటున్నారు .

బెజవాడ పేరు ఎందుకు?

కానీ బెజవాడ అని ఎందుకు వచ్చింది అంటే – ఒకప్పుడు ఆ ప్రాంతంలో పంటలు పండేవి కావు, ఎందుకంటే కృష్ణమ్మ వచ్చిన కూడా చుట్టూ ఉండేటటువంటి కొండలు అడ్డుపడ్డాయి. అడ్డుపడటంలో కృష్ణమ్మ శ్రీశైలం వైపుకి తిరిగిపోయింది, అందుకని పంటలు పండేవి కావు, అప్పుడు పరమ శివుణ్ణి ప్రార్థన చేశారు, స్వామి కృష్ణమ్మ మాకు దగ్గరగా ఉంది కానీ కొండలు అడ్డంగా ఉన్నాయి. వంకర టింకరగా ఉన్న కొండల వలన కృష్ణమ్మ ఇటువైపు ప్రవహించదు, ప్రవహించకపోవడం వల్ల పంటలు లేవు, కాబట్టి కృష్ణమ్మ ఇటు ప్రవహించేటట్టుగా మమ్మల్ని అనుగ్రహించు అని కోరారు. ఆనాడు పరమశివుడు కొండలకి రంధ్రం చేశాడు, తెలుగులో రంధ్రాన్ని బెజ్జం అంటారు, కొండలకి బెజ్జాలు పడితే అందులో నుంచి కృష్ణమ్మ ప్రవహించి విజయవాటిక ముందు నుంచి వెళ్ళింది కాబట్టి బెజ్జవాడ,బెజవాడ అయింది , ఆ బెజవాడే నేడు విజయవాడ, పురాణాల ప్రకారం విజయవాటిక అని పేరు.

vijayawada kanaka durgamma temple

Sri Durga Malleswara Swamy Varla Devasthanam – శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం, విజయవాడ:

అక్కడ ఉన్నటువంటి స్వామిని యుధిష్టరుడు అనగా ధర్మరాజు ప్రతిష్టించారు అంటారు, బ్రహ్మ  మల్లెపూలతో పూజ చేసినటువంటి కారణం చేత ఆ స్వామిని “మల్లికార్జున” అని పేరు, కావున అక్కడ ఉన్నటువంటి స్వామి “మల్లికార్జునుడు” అయ్యాడు. ఇంద్రకీలాద్రి కొండ అంతా కూడా శక్తి స్వరూపమే అని చెప్తారు పురాణాలలో, అసలు కొండే ఒక శక్తి స్వరూపం, దానిమీద కాలు పెడితే చాలు కోరికలు సిద్ధిస్తాయి, అనేక మందికి విజయాలు ఇచ్చింది.

కనక దుర్గమ్మ (Kanaka Durgamma) దసరా నవరాత్రి అలంకారాలు:

రోజుఅమ్మవారి అలంకారం (Avatar)విశిష్టత
మొదటి రోజుస్వర్ణకవచాలంకృత దుర్గాదేవిబంగారు కవచంతో భక్తులకు దర్శనం
రెండో రోజుబాలాత్రిపుర సుందరిమనసును నిర్మలం చేసే తల్లి
మూడో రోజుగాయత్రీ దేవివేదమాతగా దర్శనం
నాలుగో రోజుఅన్నపూర్ణా దేవిఆకలి తీర్చే జగన్మాత
ఐదో రోజులలితా త్రిపుర సుందరిసర్వ సౌభాగ్య ప్రదాయిని
ఆరో రోజుమహాలక్ష్మి దేవిఐశ్వర్య ప్రదాయిని
ఏడో రోజుసరస్వతీ దేవిజ్ఞానాన్ని ప్రసాదించే చదువుల తల్లి
ఎనిమిదో రోజుదుర్గా దేవిదుష్ట శిక్షణ చేసే శక్తి స్వరూపిణి
తొమ్మిదో రోజుమహిషాసుర మర్దినివిజయానికి సంకేతం
పదో రోజురాజరాజేశ్వరీ దేవిలోకాన్ని పాలించే జగన్మాత

ఇంద్రకీలాద్రి పర్వతంపై దేవాలయ సముదాయం – ముఖ్య దర్శనాలు:

కొండపై అమ్మవారిని దర్శించుకుని బయటకు వస్తే, అటువైపు పల్లంగా ఉండే మార్గం కనిపిస్తుంది. ఆ మార్గం పక్కనే ఒక చిన్న కొండ ఉంటుంది. ఆ కొండపైకి ఎక్కితే మొదట సుబ్రహ్మణ్య స్వామి దర్శనమిస్తారు. అక్కడ ప్రదక్షిణ చేసి కొండ అంచు వైపు ముందుకు వచ్చేసరికి చిన్న సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఉంటుంది. అక్కడ గోత్రనామాలతో ప్రత్యేకంగా పూజలు చేస్తారు.

అక్కడి నుంచి బయటకు వస్తే అరుగు పక్కన ఒక చెట్టు ఉంటుంది; చెట్టు కింద పుట్ట ఉండి, ఆ పుట్ట వద్ద సుబ్రహ్మణ్య స్వామి మట్టి (మన్ను) పొందుపరిచారు. అక్కడ మళ్ళీ గోత్రనామాలు చెప్పి ఆ మట్టిని చెవులకు, కళ్లకు ధరించి మెట్లదారి వైపుకి దిగాలి.

కొద్దిగా ముందుకు వెళ్లి ఎడమవైపు తిరిగితే ముందుగా గణపతి, తరువాత నటరాజ స్వామి, ఆ తర్వాత దుర్గాదేవి దర్శనమిస్తారు. అక్కడ దృష్టిదోష నివారణకు ప్రత్యేకంగా నిమ్మకాయలతో పూజ చేసి భక్తులకు ఇస్తారు. ఇంటికి లేదా వ్యక్తులకు దృష్టిదోషం వచ్చినప్పుడు ఆ నిమ్మకాయను పరిహారంగా ఉపయోగిస్తారు.

ఆ మండపం దాటి కొంత ముందుకు నడిస్తే జడలు విరబూసుకుని నిలుచుని ఉన్న పరమశివుడి అలౌకిక రూపం కనిపిస్తుంది. ఆయన శిరస్సుపై గంగమ్మ ప్రవహిస్తున్నట్లుగా అలంకరణ ఉంటుంది. అక్కడి మెట్లు దిగాక కుడి వైపు తిరిగితే మల్లికార్జున స్వామి వారి ఆలయం చేరతారు. ఆ ఆలయంలో పెద్ద శివలింగం ఉండి, అక్కడ అభిషేకాలు జరుగుతాయి.

ఆ తరువాత దిగి కిందికి వస్తే స్వామివారి కళ్యాణ మండపం ఉంటుంది. అక్కడ కళ్యాణ మూర్తులు, ఆది శంకరాచార్యుల చిన్న ఆలయం దర్శనమిస్తాయి. అక్కడి నుంచి ముందుకు వస్తే అద్దాల మండపం కనిపిస్తుంది. అందులో ఉయ్యాలలో పార్వతీ–పరమేశ్వరుల శోభాయమానమైన రూపం దర్శనం ఇస్తుంది.

అది దాటాక ముందుకు వస్తే ప్రసాదాల పంపిణీ విస్తృతంగా జరిగే ప్రాంతం చేరుతారు.

విజయవాడ కనకదుర్గమ్మ నవరాత్రులు (దసరా) ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా జరిగే పర్వదినాలు. ఈ తొమ్మిది రోజులూ అమ్మవారిని నవదుర్గల తొమ్మిది అవతారాల్లో అలంకరించి పూజిస్తారు. ప్రతి రోజూ ఒక ప్రత్యేక రూపంలో అమ్మవారి దర్శనం లభిస్తుండటం ఈ ఉత్సవాల ప్రధాన విశిష్టత.

భక్తులు ఈ సందర్భంలో గిరి ప్రదక్షిణ చేసి, ప్రత్యేక నైవేద్యాలు సమర్పించి, అమ్మవారి అనుగ్రహాన్ని కోరుకుంటారు.

ఈ వేడుకలకు సంబంధించిన దర్శనం, ప్రత్యేక పూజల కోసం అధికారిక దేవస్థానం వెబ్‌సైట్ ని చుడండి  Vijayawada Kanaka durgamma 

Google Maps Location:

ముగింపు:

ముక్కోటి దేవతల ఆశీస్సులతో, భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లిగా విజయవాడ కనకదుర్గమ్మ భక్తుల హృదయాలలో కొలువై ఉన్నారు. ఇంద్రకీలాద్రి చరిత్ర కేవలం ఒక పౌరాణిక గాథ మాత్రమే కాదు, అది చెడుపై మంచి సాధించిన విజయానికి నిదర్శనం. ప్రతి ఏటా జరిగే దసరా నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతంగా భక్తులు భావిస్తారు. మీరు కూడా ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుని, ఆ జగన్మాత కృపా కటాక్షాలను పొందాలని కోరుకుంటున్నాము.

మీకు ఈ వ్యాసం నచ్చితే:

  • ఈ సమాచారాన్ని మీ మిత్రులతో షేర్ చేయండి.

  • మరిన్ని ఆధ్యాత్మిక మరియు ఆలయ విశేషాల కోసం మా వెబ్‌సైట్ telugushine.com ను చూస్తూ ఉండండి.

  • మీకు ఏమైనా సందేహాలు ఉంటే క్రింద కామెంట్ రూపంలో తెలియజేయండి.

📢 Join Our WhatsApp Channel here:

button


Spread the love

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *